||సుందరకాండ ||

||ముప్పది ఎనిమిదవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
తతః స కపిశార్దూలః తేన వాక్యేన హర్షితః|
సీతామువాచ తత్ శ్రుత్వా వాక్యం వాక్య విశారదః||1||

స|| తతః తత్ వాక్యం శ్రుత్వా తేన వాక్యేన హర్షితా వాక్య విశారదః కపిశార్దూలః సీతాం ఉవాచ||

తా|| ఆప్పుడు ఆ మాటలు వినిన మాటలాడుటలో విశారదుడైన వానరోత్తముడు సీతతో ఇట్లు పలికెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టత్రింశస్సర్గః

ఆప్పుడు ఆ మాటలు వినిన, మాటలాడుటలో విశారదుడైన వానరోత్తముడు సీతతో ఇట్లు పలికెను.

'ఓ మంగళశ్వరూపీ అయిన సీతా ! నీవు చెప్పిన మాటలు యుక్తము. అవి స్త్రీరూపమునకు, స్వభావమునకు, సాధ్వి యొక్క నమ్రతకు అనుగుణముగా ఉన్నాయి. నాపై ఎక్కి నూరు యోజనముల విస్తీర్ణము కల సాగరము దాటుట సహజముగా స్త్రీలకు కాని పని. వినయముతో మూర్తీభవించిన ఓ జానకీ ! నీవు చెప్పిన రెండవకారణము రాముని కాక ఇతరపురుషుని తాకను అన్నది. అది ఆ మహాత్ముడైన పత్నికే సదృశము. నీవు తప్ప ఇంకెవరూ ఇటువంటి మాటలు చెప్పరు. కాకుత్‍స్థుడు ఇక్కడ జరిగినది అంతా నాముందు జరిగిన భాషణ శేషము లేకుండా వినును".

' ఓ దేవి అనేక కారణముల వలన రామునిపై కల ప్రేమతో, అయనకు ప్రీతి కలిగించవలననే మనస్సుతో నాచేత ఈ విధముగా చెప్పబడినది. లంకాప్రవేశము దుష్కరము కనుక, దాటుటకు సాధ్యముకాని మహాసాగరము వలన, నాకు కల సామర్థ్యము వలన ఇది చెప్పబడడమైనది. గురుస్నేహము పై భక్తితో నిన్నుఈ దినమే రాఘవునితో చేర్చుటకు ఈ విధముగా చెప్పబడడమైనది. ఇంకేమీ కారణములేదు. దోషములు లేని ఓ సీతా, నాతో వెళ్ళుటకు ఇష్టము లేనిచో అప్పుడు రాఘవునకు తెలియునట్లు ఒక అభిజ్ఞానమును ఇవ్వుము.'

ఈ విధముగా హనుమంతునిచే ప్రేరేపింపబడిన, సురలతో సమానమైన సీత కన్నీళ్ళతో తడబడిన మాటలతో మందస్వరముతో ఇట్లు పలికెను. 'నీకు ఈ శ్రేష్ఠమైన నా ప్రియునకు తెలిసిన ఆభిజ్ఞానము చెప్పెదెను.'

'చిత్రకూట పర్వతముయొక్క ఈశాన్యభాగములో , జలమూలఫలములు సమ్మృద్ధిగా వున్న పర్వతపాదప్రాంతములో, సిద్ధాశ్రమములు కలప్రదేశములో, మందాకినీ నదికి దగ్గరలో తాపసాశ్రమ వాసుల వలె ఉండెడివారము. అక్కడి పుష్పపరిమళాలతో నిండిన ఉపవనములలో విహరించి నీ వడిలో పడుకొనినదానను.

అప్పుడు ఒక వాయసము మాంసపు ముక్కతో దానిని మాటిమాటికి తన ముక్కుతో పొడుస్తూ ఉండెను. నేను ఒక మట్టిబెడ్డతో దానిని వారించుతున్నదానను, ఆ కాకి నా చుట్టు తిరుగుతూ నన్ను పొడుఛుటకు ప్రయత్నము చేసెను. తినుటకు కోరికగల ఆ కాకి మాంసఖండమును వదలలేదు. నేను ఆ పక్షిపై కోపముతో వున్న జారిన పమిటను సరిచేసుకొనుచున్ననన్ను నీవు చూచితివి.

'అలా కోపములో ఉన్న నన్నుచూసి నవ్వితివి. సిగ్గుపడి, తినాలనే కోరికగల కాకిచేత గీకబడి, నేను నీ ఆశ్రయమునకు చేరితిని. శాంతముగా ఉపాసీనుడవైన నీ వడిలో మరల ప్రవేశించితిని. క్రోధముతో ఉన్న నన్ను నవ్వుతూ ఊరడించితివి. ఓ నాధ ! వాయసముచేత ప్రకోపింపబడిన భాష్పములతో నిండిన ముఖము కల, నాక్రోధమును నీవు చూచితివి.

' నేనుకూడా ఆ శ్రమతో రాఘవుని అంగములలో చాలాసేపు నిద్రపోయితిని. మరల భరతాగ్రజుడు నా అంగములలో నిద్రపోయెను. అప్పుడు ఆ వాయసము మరల అచటికే వచ్చెను. అప్పుడు ఆ వాయసము వెంటనే వచ్చి రాముని అంగములనుంచి లేచిన నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. అది మళ్ళీ ఎగిరి మళ్ళీ పొడిచెను'.

అప్పుడు రాముడు మీదపడుచున్న రక్త బిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసముచేత బలవత్తరముగా బధింపబడుతున్న నా చేత శతృవులను తపించు సుఖముగా నిద్రలో నున్న శ్రీమాన్ లేపబడెను . ఆ మహాబాహువులు కల అతడు స్తనములప్పై గాయపరచబడిన నన్నుచూచి కోపముతో విషముక్రక్కుచున్న పాము వలె బుసలు కొట్టుతూ ఇట్లు పలికితివి.

"ఓ నాగనాసోరూ ! సీతా నీ స్తనముల మధ్య లో గాయము చేసిన వాడెవడు. కోపించిన ఇదుతలలగల పాముతో ఎవడు ఆడగోతుచున్నాడు". అలా అని చూస్తూ వున్న నీవు, తీక్షణమైన గోళ్లతో నాకు ఎదురుగా నిలబడి వున్న అ వాయసమును చూచితివి. ఎగురువానిలో శ్రేష్ఠుడు ఆ వాయసము ఇంద్రుని పుత్రుడు. శీఘ్రముగా భూమిపై దిగి వచ్చిన వాడు. గతిలో వాయుసమానుడు'.

'అప్పుడు మహాబాహువులు కల వాడు బుద్ధికలవారిలో శ్రేష్ఠుడు కోపముతో నిండిన కళ్లతో ఆ వాయసముపై కఠినముగా ఆలోచించితివి. అప్పుడు దర్భాసనమునుండి ఒక దర్భను తీసికొని బ్రహ్మ అస్త్రముగా ప్రయోగించితివి. ఆ అస్త్రము కాలాగ్నివలె మండుచూ ఆ వాయసమునకు అభిముఖమై ప్రజ్వరిల్లసాగెను. ఆ మండుచున్న దర్భను ఆ వాయసముపై ప్రయోగించితివి. అప్పుడు ఆ దర్భ ఆ వాయసమును ఆకాశములో అనుసరించసాగెను'.

'అప్పుడు ఆ కాకి బ్రహ్మాస్త్రముచే అనుసరించబడినదై అనేకమైన ప్రదేశములు వెళ్ళెను. తనప్రాణ రక్షణకోసము అన్ని లోకములనూ గాలించెను. ఆ వాయసము ముల్లోకములను తిరిగి, తన తండ్రి అలాగే మహర్షులచేత తిరస్కరింపబడిన వాడై, నిన్నే శరణు కోరెను. శరణుకోరబడిన ఆ కాకుత్‍స్థుడు , శరణాగతుడై భూమిపై పడివున్న అ వాయసమును వధార్హుడైనప్పటికీ దయతో కాపాడితివి.'

'అలిసిపోయి విషణ్ణ వదనముతో వచ్చిన ఆ వాయసముతో ఇట్లు పలికితివి. "ప్రయోగింపబడిన బ్రహ్మ అస్త్రమును నిరర్ధకము చేయుట శక్యము కాదు. ఏమి చేయవలనో చెప్పుము" అని. అప్పుడు ఆ వాయసము చెప్పెను. " నీ శరము నా కుడికన్నును నిరర్ధకము చేయుగాక" అని. అప్పుడు ఆ వాయసముయొక్క కుడికన్ను నిరర్ధకము చేయబడినది. ఆ వాయసము అలా కుడి కన్ను ఇచ్చి తన ప్రాణములను రక్షించుకొనెను. పిమ్మట ఆ వాయసము రామునకు నమస్కరించి దశరథునకు నమస్కరించి ఆ వీరుని ఆజ్ఞతో తన నివాసమునకు తరలి పోయెను'.

' ఓ రాజా ! నన్ను బాధించిన ఆ వాయసముపై బ్రహ్మాస్త్రము ప్రయోగించిన నీవు, నన్ను అపహరించిన వానిని ఎందుకు క్షమిస్తున్నావు? ఓ నరర్షభ ! మహోత్సాహముతో నాపై దయచూపుము. ఓ నాధా ! నాధకల నేను అనాధవలె నున్నాను'.

'ఇతరుల శోకమును శమింపచేయుట ధర్మము అని నీ దగ్గరనుంచే నాచేత వినబడినది. నీవు మహావీరుడవు మహోత్సాహముకల మహాబలుడవు. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయువాడవు. సముద్రము వలె గంభీరుడవు. ధరణికి భర్త. ఇంద్రుని తో సమానుడవు అని నాకు తెలుసు '.

' ఓ రాఘవా అస్త్రములు ప్రయోగించువారిలో శ్రేష్ఠుడవు బలవంతుడవు అయి ఈ రాక్షసులపై ఎందుకు అస్త్రములను ప్రయోగించవు? సమరములో రాముని ధాటికి నిలబడుటకు నాగులు గంధర్వులు సురులు మరుద్గణములు కూడా సమర్థులు కారు. ఆ వీరుడైన రామునకు నాపై కించిత్తు దయవున్నా తీక్షణమైన బాణములతో రాక్షసులను ఎందుకు నాశనము చేయుటలేదు?'

'పరంతపుడు మహాబలుడు వీరుడు అయిన లక్ష్మణుడు అన్నగారి ఆదేశముతో ఎందుకు నన్ను రక్షించుట లేదు? వాయువు అగ్నితో సమానమైన తేజస్సుగల పురుషవ్యాఘ్రము లగు వారిని సురులు కూడా ఎదురుకొనలేరు. వారు నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నారు? నాలో ఎదో మహత్తరమైన పాపము ఉన్నది. సంశయము లేదు. సమర్ధులైనాగాని ఆ పరంతపులు నన్ను ఉపేక్షించుచున్నారు'.

వైదేహి యొక్క ఆ కన్నీరుతో పలికిన వచనములను వినిన మహా తేజము కల ఆ హనుమంతుడు ఇట్లు పలికెను.

'ఓ దేవి నీ వియోగ శోకముతో రాముడు విషయములలో విముఖత చూపించుచున్నాడు. సత్యముగా ప్రమాణము చేసి చెప్పుచున్నాను. రాముడు దుఃఖములో నుండుటవలన లక్ష్మణుడు కూడా దుఃఖములో ఉన్నాడు. ఎలాగో అదృష్టము కొలదీ నీవు చూడబడినావు. ఇది విచారించవలసిన కాలము కాదు. ఓ పూజ్యురాలా ! ఈ క్షణమే దుఃఖముల అంతము చూస్తున్నావు. ఆ మహాబలవంతులూ పురుషవ్యాఘ్రములు అగు రాజపుత్రులు ఇద్దరూ నీ దర్శనము నకై ఉత్సాహముతో ఈ లంకానగరమును భస్మము చేసెదరు. ఓ విశాలాక్షీ రాఘవుడు రావణుని అతని బంధువులతో సహా హతమార్చి నిన్ను తన పురమునకు తీసుకుపోవును'.

'రాఘవునకు, మహాబలుడు లక్ష్మణునకు, తేజస్వి సుగ్రీవునకు అక్కడ సమాగమైన వానరులకు ఎమి మాటలు చెప్పవలెనో అవి నీవు చెప్పుము '. ఈ విధముగా చెప్పబడిన, శోకములో ఉన్న, సురలతో సమానమైన ఆ సీతా మారుతాత్మజుడగు హనుమంతునితో ఇట్లు పలికెను.

'లోకము సంరక్షించుటకు మనస్విని అయిన కౌసల్య ఎవరిని జన్మనిచ్చెనో వానికి నాకొఱకు శిరస్సు వంచి అభివాదము చేసి వారి కుశలము అడుగుము. పుష్పమాలికలనూ , అన్ని రత్నములను అనురాగవతులైన స్త్రీలను విశాలమైన పృథివినీ దుర్లభమైన ఇశ్వర్యమును త్యజించి తల్లి తండ్రుల అనుమతితో రాముని అనుసరించినవాడు సుమిత్రానందనుడు'.

'లక్ష్మణుడు ధర్మాత్ముడు , అత్యుత్తమమైన సుఖము ను త్యజించి అన్నగారైన కాకుత్‍స్థుని కి తోడునీడగా వనములో అనుసరించును. సింహపు స్కంధమువంటి స్కంధముకల, మహాబాహువులు కల, మనస్వి, ప్రియదర్శనుడు. నన్ను కన్నతల్లిలాగ రాముని కన్న తండ్రిలాగా చూచుకొనును. వీరుడు లక్ష్మణుని కి నన్ను అపహరింపబడడము తెలియదు. వృద్ధులని సేవించు, వివేకముగల సమర్థుడైన అందరిమెప్పు పొందిన ఆ రాజకుమారుడు నా మామగారితో సమానుడు'.

'రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు. ఎల్లప్పుడూ నాకు ప్రియమైన వాడు. వీరుడు ఏపని అప్పగించినా నిర్వర్తించువాడు. ఎవరిని చూచి రాముడు జరిగిన వృత్తాంతము తలచడో అతనిని నాకొఱకై నా మాటలుగా కుశలము అడుగుము'.

'ఓ వానరోత్తమ మృదుస్వభావి పావనుడు సమర్థుడు రామునికి ప్రియుడు అయిన లక్ష్మణుడు ఏవిధముగా నాదుఃఖమును అంతముచేయునో అట్లు నీవు కార్యము సాధింప వలెను'.

'రాఘవుడు నీ సంరంభము వలనే నన్ను రక్షించు యత్నములో పడును. నా నాధునికి మరల మరల చెప్పుము. దశరథాత్మజ నేను ఒక మాసము జీవితము ధరించెదను. మాసము గడిచి జీవించను. నేను సత్యముగా చెప్పుచున్నాను. ఓ వీరా పాపకర్ముడగు రావణుడు నన్ను బంధించినవాడు. పాతాళమునుంచి ఇంద్రుని ఇశ్వర్యమును విష్ణువు రక్షించినట్లు నీవు నన్ను రావణబంధమునుండి రక్షింపవలెను'.

అప్పుడు సీత తన వస్త్రములో కట్టబడిన శుభకరము దివ్యము అయిన చూడామణిని తీసి రాఘవునకు ఇవ్వమని హనుమంతునికి ఇచ్చెను. అప్పుడు ఆ వీరుడు అత్య్త్తమమైన ఆ మణిరత్నమును తీసుకొని అది తన భుజమునందు ఇమడని కారణమువలన తన వేలికి పెట్టుకొనెను.

ఆ కపిప్రవీరుడు మణిరత్నములు తీసుకొని సీతాదేవికి ప్రదక్షిణము చేసి అభివందనములు చేసి అమె పక్కన నిలబడెను. ఆతడు సీతా దర్శనముతో అత్యంత హర్షముపొంది శరీరము ఇక్కడే ఉన్నా తన మనస్సుతో రాముని చేరెను.

జనకమహరాజు యొక్క కుమార్తె ద్వారా మహత్తరమైన మణిని తీసుకొని, వాయువులచే కంపింపబడి కుదుటబడిన పర్వతమువలె, సుఖమైన మనస్సు గలవాడై తిరుగు ప్రయాణమునకుహనుమంతుడు సిద్ధపడెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఎనిమిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
మణివరముపగృహ్య మహార్హం
జనకనృపాత్మజయా ధృతం ప్రభావాత్|
గిరిరివ పవనావధూతముక్తః
సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే||74||

స|| మహార్హం జనకనృపాత్మజయా ధృతం తం మణివరం ఉపగృహ్య ప్రభావాత్ పవనావధూతముక్తః గిరిరివ సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే||

తా||జనకమహరాజు యొక్క కుమార్తె ద్వారా మహత్తరమైన మణిని తీసుకొని, వాయువులచే కంపింపబడి కుదుటబడిన పర్వతమువలె, సుఖమైన మనస్సు గలవాడై తిరుగు ప్రయాణమునకుహనుమంతుడు సిద్ధపడెను.
||ఓమ్ తత్ సత్||